హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ‘మీరు జర్నలిస్టులా? అయితే ఏ క్యాటగిరీ కింద వస్తారు? ఏ, బీ, లేదా రెడ్? క్యాటగిరీని బట్టి మీకు ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు ఉంటాయి’.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మీడియా సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఇది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో దారుణమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మీడియా సంస్థలకు ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యమే ప్రాతిపదికగా జర్నలిస్టులను అనధికారికంగా మూడు క్యాటగిరీలుగా విభజించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మీడియాలో కనీసం ఓనమాలు తెలియని సీపీఆర్వో మల్సూర్ చేసిన ఈ విభజనను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించి అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా పనిచేస్తున్న మీడియాను ఏ క్యాటగిరీలో చేర్చినట్టు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న ‘ఎల్లో మీడియా’కు కూడా తెలంగాణలో పెద్దపీట వేశారని, ఏ క్యాటగిరీలో చేర్చారని ప్రచారం జరుగుతున్నది. సీఎంవో అజమాయిషీలోని ప్రజాసంబంధాల విభాగాన్ని అదే సామాజికవర్గం వారితో నింపారని సచివాలయ వర్గాల్లో అసహనం వ్యక్తం అవుతున్నది. ఏ క్యాటగిరీలోని సంస్థల జర్నలిస్టులకు ఎప్పుడైనా నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం, ఆయన ముందు కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం వంటి వెసులుబాట్లు కల్పించినట్టు చెప్పుకుంటున్నారు.
విమాన, హెలికాప్టర్ ప్రయాణాలు, విందు భోజనాలు వంటి రాచమర్యాదలు చేస్తున్నారని సమాచారం. ఇందులో కొన్ని యూట్యూబ్ చానళ్లు కూడా ఉన్నాయట. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెంట రాష్ట్రం నుంచి 26 మంది జర్నలిస్టులను తీసుకువెళ్లినట్టు తెలిసింది. వారిలో సింహభాగం ఏ క్యాటగిరీ వారినే తీసుకువెళ్లారని జర్నలిస్టు సంఘాలు చెప్తున్నాయి. వీరికి రాచమర్యాదలు కల్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంతో బాగానే ఉంటున్నా, వేరే సామాజికవర్గం యాజమాన్యాల పత్రికలను ‘బీ’ క్యాటగిరీలో చేర్చినట్టు సమాచారం. మీడియా సర్కిళ్లలో అంతో ఇంతో పేరున్న పత్రికలను, గతంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నడిచిన పత్రికలను, రాష్ట్రంలో రెండో అత్యధిక సర్క్యులేషన్ ఉండి, ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా మారిన పత్రికను ఈ క్యాటగిరీలో పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఆయా సంస్థల జర్నలిస్టులు పిలిచినప్పుడు రావాలని, చెప్పింది రాయాలని ఆదేశిస్తున్నారట. అలా చేస్తే ఏ క్యాటగిరీ జర్నలిస్టులకు కల్పించిన సౌకర్యాలు వీరికి కూడా వర్తిస్తాయని షరతు విధిస్తున్నారట.
ఇక ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ‘సీ’ క్యాటగిరీలో చేర్చినట్టు సమాచారం. దీనినే రెడ్ క్యాటగిరీ అని పిలుస్తున్నారట. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్‌ను ఈ క్యాటగిరీలో పెట్టినట్టు సమాచారం. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న యూట్యూబ్ చానళ్లను కూడా ఈ క్యాటగిరీలోనే చేర్చినట్టు చెప్పుకుంటున్నారు. ‘కొందరు జర్నలిస్టులు ఎదురుపడితే చెంప చెల్లుమనిపించాలనేంత కోపం వస్తున్నది’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వీరిని ఉద్దేశించే వ్యాఖ్యానించారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
‘ఇది ప్రజా పాలన, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి, సెక్రటేరియట్ గేట్లు తోసుకొని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు’ 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. కానీ, కొన్ని రోజులకే అసలు రంగు బయటపడింది. సచివాలయంలోకి మీడియా ప్రతినిధులు, సామాన్య ప్రజల రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇప్పుడు సచివాయలంలోనూ క్యాటగిరీల వారీగా మర్యాదలు దక్కుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఏ క్యాటగిరీ వారు ఎప్పుడైనా లోనికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారట.
వారు అడిగిన సమాచారం ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించినట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం, మంత్రుల మీడియా సమావేశాలు ముందుగానే వీరికి చేరుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇక బీ క్యాటగిరీ వారు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే పాస్ తీసుకొని లోనికి వెళ్లాలని సూచించినట్టు సమాచారం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ప్రతినిధులకు సచివాలయంలో అడుగడునా ఆంక్షలు పెడుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే మీడియా సమావేశాలకు వెళ్లినా, పోలీసులు మెయిన్ గేట్ నుంచి మొదలు పెడితే ఐదో ఫ్లోర్ వరకు చెక్ చేస్తున్నారు. ఏ క్యాటగిరీ వారు నేరుగా వెళ్తుండగా, బీ క్యాటగిరీ వారి సెల్ఫోన్లు డిపాజిట్ చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఇక రెడ్ క్యాటగిరీ వారికి అనుమతి కష్టసాధ్యంగా మారింది.