కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనారి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆదివారం గ్రామస్థులు సింగిల్ ఫేస్ కరెంటును నిరంతరం సరఫరా చేయాలని కోరుతూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త నమస్తే తెలంగాణ ( Namasete Telangana) దినపత్రికలో ‘ఐటీ కి కరెంట్ కష్టాలు’ శీర్షికన మెయిన్ పేజీ ( Main Page) ఫ్రంట్ లో ప్రచురితమైంది.
స్పందించిన ఆ శాఖ జిల్లా అధికారి సూపరింటెండెంట్ ఇంజినీర్ బి సుదర్శనం( SE Sudharsanam), భైంసా సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు, ఆ శాఖ కుబీర్ ఏఈ ఆదిత్య తో కలిసి సోమవారం సోనారి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో సమావేశమై చర్చించారు. సింగిల్ ఫేస్ కరెంటు విషయమై చర్చించి సమస్యను ఒకటి, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ మండలంలోని మాలేగాం గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయిందని ట్రాన్స్ఫార్మర్ ఒకటి, రెండు రోజుల్లో ఇక్కడికి రానుందని దాన్ని చార్జ్ చేయగానే మరింత మెరుగైన విద్యుత్తును అందించే వీలుంటుందన్నారు. మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సోనారి సబ్‌స్టేషన్ నుంచి మలేగాం ఫీడర్‌ను వేరు చేయడం ద్వారా లోడ్ రిలీఫ్ అవుతుందని వెల్లడించారు. లోడ్ బదలాయింపు చేపట్టడం ద్వారా విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా సోనాలి గ్రామస్థులు ఆయనకు వినతి పత్రాన్ని అందించి తక్షణమే గ్రామానికి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అందించాలని కోరారు.