Nallamala Safari | అమ్రాబాద్ : పర్యాటకులకు నాగర్కర్నూల్ ఫారెస్ట్ శాఖ శుభవార్త చెప్పింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో జంతువుల సంతతి కోసం మూడు నెలలు (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) పాటు సఫారీ యాత్రను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి (అక్టోబర్ ఒకటి) మళ్లీ సాఫరీని పునః ప్రారంభించనున్నట్లు మన్ననూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వర్ తెలిపారు. ఏటీఆర్లో ఫరహాబాద్ ద్వారం నుంచి జంగల్ సఫారీ యాత్ర ప్రారంభమవుతుందన్నారు.
నల్లమల అడవుల్లోని వృక్షజాలం, జంతుజాలం గురించి పర్యాటకులకు వివరిస్తూ ముందుకు సాగనున్నదన్నారు. వాహనాలు నిర్ణీత మార్గాల్లో వెళ్తున్నాయో లేదో పరీక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యాత్ర ఉంటుందని, ఒక్కొక్కరూ రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మన్ననూర్ అటవీ శాఖ కార్యాలయం, ఆన్లైన్ ద్వారా యాత్రను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఒక్కో వాహనంలో గరిష్ఠంగా ఏడుగురికి అనుమతి ఉంటుందని వివరించారు.