Congress | హన్వాడ/కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి/నీల గిరి, డిసెంబర్ 4: నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీల్లో భాగంగా.. బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల వద్ద పటాకులు కాల్చి హల్చల్ చేశారు. ఈ క్రమంలో వారి ఇండ్లపై, వారి కుటుంబ సభ్యులపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఇరువురు ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోగా.. కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
☞ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందడంతో మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీలో సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ సర్పంచ్ వెంకటమ్మ భర్త పెద్ద వెంకన్న తన ఇంటి దగ్గరే ఉండి ఈ సంబురాలను చూస్తుండగా.. అదే కాలనీకి చెందిన శ్రీకాంత్, శివకుమార్, రమేశ్ ఆయనపై అకారణంగా దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త ఆంజనేయులుపై కూడా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. ఈ మేరకు వారు హన్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై రవినాయక్‌ను వివరణ కోరగా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని తెలిపారు.
☞ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై దాడులు చేశారు. కొల్లాపూర్ మండలం సింగవట్నంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ కార్యకర్తలు శివ, బాలపీరు, రాముడు ఆ పక్క నుంచి కారులో వెళ్తుండగా కారుపైకి రాళ్లు విసిరారు. వారు కారు దిగొచ్చి కారుపై రాళ్లు ఎందుకు వేశారని ప్రశ్నించగా.. ఆగ్రహంతో వారిని వెంబడిస్తూ రాళ్లతో దాడిచేశారు.
☞ పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో పోలింగ్ ముందు రోజు రాత్రి కత్తిపోటుకు గురైన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేశ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, గేటు ధ్వంసమయ్యాయి.
☞ దేదినేనిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్(ఎంపీటీసీ భర్త) ఇంటిపై, శ్రీపతిరావు ఇంటిపై దాడులు చేసి కిటికీలు పగులగొట్టారు. కురుమ కులానికి చెందిన భార్యాభర్తలను కొట్టడంతోపాటు వాల్మీకి కార్యకర్త ఇంటిపైనున్న ప్లాస్టిక్ కవర్‌కు నిప్పుపెట్టారు.
☞ నల్లగొండ మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ భర్త జేరిపోతుల భాస్కర్‌గౌడ్, తన సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి స్థానిక మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఇంటి ముందు పటాకులు కాలుస్తూ హంగామా చేశారు. ఆ సమయంలో సైదిరెడ్డి ఇంట్లో లేరు. పటాకుల నిప్పురవ్వలు ఎగిరి ఇంట్లో పడుతుండటాన్ని చైర్మన్ భార్య సెల్ఫోన్లో చిత్రీకరిస్తుంటే.. ఆమె ఫోన్‌ను గుంజుకునేందుకు ప్రయత్నించారు. చైర్మన్ తల్లిపై కూడా దాడి చేశారు. విషయం తెలుసుకున్న సైదిరెడ్డి ఇంటికొచ్చే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై నల్లగొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో చైర్మన్ సైదిరెడ్డి కేసు పెట్టారు. తన కారును ధ్వంసం చేశారని భాస్కర్‌గౌడ్ కూడా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు నల్లగొండ రూరల్ ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.