నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీ జనజాతర సాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలకు ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు అనూహ్య స్పందన లభించింది. సభలు జరిగిన పట్టణాలు గులాబీ వనంగా మారాయి. సభ ప్రారంభానికి ముందు కళాకారుల ఆటాపాటలకు ఎక్కడోళ్లు అక్కడే నిల్చొని డ్యాన్సులు చేశారు.
కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మలయ్యయాదవ్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాదసభకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వచ్చే సరికి సభా ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభా ప్రాంగణంలో కాలుపెట్టే సందు లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ కనపడగానే ఒక్కసారిగా ఈలలు, కేకలు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. కేసీఆర్ వేదికపైకి వస్తుంటే అంతా లేచి చప్పట్లతో స్వాగతించారు. సభ ఆసాంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగడం విశేషం. భారీ జన సందోహం గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ, ఇక మల్లయ్య గెలుపును ఎవరూ ఆపలేరన్నప్పుడు జనం చప్పట్లతో ప్రతిస్పందించారు. ‘మల్లయ్య బీసీ బిడ్డ.. పీహెచ్డీ వరకు చదువుకున్న వ్యక్తి.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిండు.. కొంతమంది కుట్రలు చేస్తూ ఎన్ని ఒడిదొడుకులు సృష్టించినా నియోజకవర్గాన్నే పట్టుకొని, జనాన్నే నమ్ముకొని తిరుగుతున్నాడ’ని కేసీఆర్ ప్రశంసించగా.. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో జరిగిన సమర శంఖారావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తుంగతుర్తి నియోజకవర్గం ఆసాంతం సభకు తరలివచ్చినట్టుగా కనిపించింది. మిట్టపల్లి సురేందర్ నేతృత్వంలోని కళాకారుల ఆటపాటలకు సభ హోరెత్తింది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి సభికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ‘తుంగతుర్తిని చూస్తుంటే తుర్తి కలుగుతుంది’ అని కేసీఆర్ అనగానే ఒక్కసారిగా సభ చప్పట్లతో మార్మోగింది. ‘ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పట్టుదల కలిగిన ఎమ్మెల్యే.. అందుకే ఇంతటి అభివృద్ధి చేసుకున్నమని’ కేసీఆర్ చెప్పగా ఈలలు, కేరింతలతో సభ దద్దరిల్లింది. కిశోర్‌కుమార్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే తిరుమలగిరి నియోజకవర్గానికి మొత్తం దళితబంధు ఇస్తానని చెప్పగా.. హర్షం వ్యక్తమైంది.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ దద్దరిల్లింది. ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో సూపర్ సక్సెస్ అయ్యింది. కేసీఆర్ రాక గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యకు బంగారు భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం ఆసాంతం సభ ఈలలు, చప్పట్లతో మార్మోగింది. తన బిడ్డ గొంగిడి సునీతామహేందర్ రెడ్డిని మరోసారి గెలిపించి, దీవించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.