Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు ప్రక్రియకు అధ్యాపకులను సన్నద్ధం చేసేందుకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న ”న్యాక్ అక్రిడిటేషన్, అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ లెర్నింగ్” వర్క్ షాప్ బుధవారంతో ముగిసింది. ఈ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమాన్ని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. నిత్య విద్యార్థిగా అధ్యాపకులు కాలానుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. సంప్రదాయ విద్యావిధానాల నుంచి ఆధునిక, డిజిటల్ విద్యా విధానానికి మారే క్రమంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరించారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలెటిక్స్ సహా ఆయా రంగాల్లో నైపుణ్యాధారిత విద్య, ఇంటర్న్షిప్, అంకురాల ఏర్పాటు, పరిశ్రమలతో కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ దృక్పథాన్ని కొనసాగిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పనిచేయాలని సూచించారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. న్యాక్ సహా ఎన్ఐఆర్ఎఫ్, అంతర్జాతీయ స్థాయిలో ఓయూ ఉత్తమ విద్యాసంస్థగా గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి, సెంటర్ ఫర్ రీసర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ సీఈవో ఆర్. సుబ్రహ్మణ్యం, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ఐక్యూఏసీ డైరెక్టర్ శిరీష, కోఆర్డినేటర్ డాక్టర్ హరీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.