అలంపూర్, అక్టోబర్ 25: ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు పరిసరాల్లో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద మిస్టరీ వీడింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ముందుగా బైక్‌ను బస్సు ఢీకొనలేదని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రకటించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామి అలియాస్ నానిగా గుర్తించారు. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకొని అసలు విషయాన్ని రాబట్టారు. శివశంకర్, ఎర్రిస్వామి బైక్‌పై లక్ష్మీపూర్ నుంచి అర్ధరాత్రి 2గంటల తర్వాత తుగ్గలి గ్రామానికి బయల్దేరారు. మధ్యలో ఓ పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించాక బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.
ఈ క్రమంలో శివశంకర్, ఎర్రిస్వామి కిందపడిపోయారు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగి చూడగా, అప్పటికే మృతిచెందినట్టు గుర్తించాడు. బైక్‌ను కూడా పక్కకు తీయాలని అనుకునే లోగా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టింది. కొంత దూరం బైక్‌ను ఈడ్చుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి స్వగ్రామం తుగ్గలికి పారిపోయాడు. ఉలెందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. వేమూరి కావేరి ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏపీ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్టు అధికారులు పరిశీలించారు. బస్సు డిజైన్, కండీషన్ తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
భారీగా సెల్ఫోన్లు, గ్యాస్ సిలిండర్
ప్రమాదానికి గురైన బస్సు లగేజీ క్యాబిన్లో భారీగా మొబైల్ ఫోన్లు ఉండటం, అవి పేలడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్టు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. సెల్‌ఫోన్ బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్ధం వచ్చింది. ఇది గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేసి పారిపోయాడు. దీంతోపాటు సిలిండర్ ఉండటంతో ప్రమాద తీవ్ర మరింత పెరిగినట్టు గుర్తించారు.
మద్యం మత్తులో బైకర్
ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌లోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో బైక్ వెనక ఎర్రిస్వామి ఉన్నాడు. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తున్నది. పెట్రోల్ బంకు వద్దే అతను తూలుతూ నడుస్తుండటం, బైక్‌ను ర్యాష్‌గా నడపడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇక బైకర్ వెళ్లిన 13 నిమిషాల తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకును దాటినట్టు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది.