ఆదిలాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘పేదరికంలో మగ్గుతున్నాం. నేను కట్టుకున్న ఇంట్లోకి నా కొడుకు రానివ్వడం లేదు. ఈ విషయమై గతంలో భార్యతో కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశాం. తిరిగి కూతురు ఇంటికి వెళ్తుండగా భార్య మృతిచెందింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌కు చెందిన వృద్ధుడు దేవ్‌రావు (82) సోమవారం రెండోసారి ప్రజావాణికి వచ్చాడు. ఈ సందర్భంగా దేవ్‌రావు మాట్లాడుతూ.. క్రాంతినగర్‌లో సొంతిల్లు ఉందని, కుమారుడు గెంటేశాడని, ఈ విషయమై జూలై 15న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీకి ఆటోలో కూతురు, అల్లుడు వద్దకు వెళ్తుండగా భార్య (80) మరణించింది. మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కూతురు విమల, అల్లుడు పాండురంగ్‌తో కలిసి వచ్చానని దేవ్‌రావు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో చెప్పాడు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని ఆ వృద్ధుడు కోరాడు.