Mutton Canteens | మీరు మాంసాహారులా..? అందులోనూ మటన్ అంటే ఇష్టపడుతారా..? అలాంటి వారికి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ శుక్రవారం ప్రకటించింది.
ఈ మటన్ క్యాంటీన్లలో మటన్ బిర్యానీతో పాటు పాయ, గుర్దా ఫ్రై, పత్తార్ కా గోస్ట్, కీమా వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే మొదటి క్యాంటీన్‌ను కో ఆపరేటివ్ ఫెడరేషన్ కార్యాలయం ఉన్న శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంటీన్ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. అయితే మెనూ ధరలు ఖరారు కానప్పటికీ, సరసమైన ధరలకే మటన్ వంటకాలను అందుబాటులోకి తేనున్నారు.
ఫిష్ క్యాంటీన్ల మాదిరిగానే మటన్ క్యాంటీన్లను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఫిష్ క్యాంటీన్లలో ఫిష్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై వంటి వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిష్ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తుండటంతో.. మటన్ క్యాంటీన్లను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.