హసన్‌పర్తి, జూన్ 6 : విద్యార్థులు అంకితభావంతో, క్రమశిక్షణతో మెదిలితే లక్ష్యాన్ని చేరుకుంటారని సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా అనంతసాగర్ శివారు ఎస్ఆర్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా ఏపీ ప్రభుత్వ ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కీరవాణి హాజరయ్యారు. తెలుగు సినీపరిశ్రమకు కీరవాణి చేసిన సేవలను గుర్తించి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ఎస్ఆర్ చాన్స్‌లర్ వరదారెడ్డి తనకు డాక్టరేట్‌ను ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. స్నాతకోత్సవంలో ఎస్ఆర్ యూనివర్సిటీ గత మూడేళ్లలో నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఉండడం విశేషమన్నారు. వరదారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకుసాగాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు.