Musi Development | లక్షన్నర కోట్ల ప్రాజెక్టుకు 1,500 కోట్లే.. బారెడు మూసీకి మూరెడు నిధులు
మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చు చేసుడు దేవుడెరుగు..
- భూసేకరణకూ సరిపోని నిధులు
- రేవంత్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ప్రాధాన్యం కరువు
Musi Development | హైదరాబాద్ సిటీబ్యూరో/ప్రధాన ప్రతినిధి, జూలై 25 (నమస్తే తెలంగాణ): మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చు చేసుడు దేవుడెరుగు.. కనీసం కేటాయింపుల్లోనూ అత్తెసరు నిధులతో లెక్కలు చూపించింది. ఇక లెక్కలు తేలి, పనులు మొదలుపెట్టాలంటే బారెడున్న మూసీ సుందరీకరణ.. మూరెడు నిధులతో ఎలా సాధ్యం అవుతుంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రూ.1,500 కోట్లు 56 కిలోమీటర్ల మేర భూసేకరణకు కూడా సరిపోవని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆర్థిక రంగ సంస్థలు, ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్న ప్రభుత్వం.. అప్పులు తెచ్చి మూసీని మెరిపించాలని భావిస్తున్నది. ఇప్పటికే పలు సంస్థలతో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు సంప్రదింపులు జరపటం గమనార్హం.
తలలు పట్టుకుంటున్న అధికారులు
55 కిలోమీటర్ల పొడవునా మూసీ నదికి ఇరువైపులా రవాణా సదుపాయాలు, అందమైన పార్కులు, ఐటీ టవర్లు అంటూ గొప్పలు చెప్పగా, కేటాయించిన బడ్జెట్ చూసి మూసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన కోసం అధికారులు నదికి ఇరువైపులా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. మొత్తం 12 వేలకు అక్రమ నిర్మాణాలను గుర్తించింది. వీటన్నింటిని తొలగించి మూసీని అభివృద్ధి చేయాలంటే భూసేకరణకే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓ అంచనా ప్రకారం.. లెక్కతేల్చిన మొత్తం నిర్మాణాల్లో 60 శాతం నిర్మాణాలకు పరిహారాన్ని చెల్లించాలంటే రూ.వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక డీపీఆర్, ప్రాజెక్టు నిర్మాణం, మౌలిక వసతుల పేరిట భారీ మొత్తంలో ఖర్చు తప్పదు. మూసీపై ఉన్న వంతెనల నిర్మాణం, ఆధునీకరణ, ఎస్టీపీల నిర్మాణం, మురుగు నీటి తరలింపు తదితర పనులకు రూ.వేల కోట్లు అవుతాయి. కానీ ప్రభుత్వం కేటాయించిన రూ.1,500 కోట్లు దేనికోసం ఖర్చు చేయాలనే విషయంలో అధికారులకు స్పష్టత లేకుండా పోయింది.
నిధులు ఒక్క శాతమే
ప్రాజెక్టు కోసం ఆహ్వానించిన టెండర్లను అమలు చేయాలంటేనే కనీసం రూ.400-500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. మూసీ పేరిట నిధుల సమీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా జైకా లాంటి ఆర్థిక సంస్థలతో మంతనాలు జరిపారు. కేంద్రం నుంచి కూడా భారీ నిధులు తెచ్చుకునేలా సంప్రదింపులు చేసి రూ.10 వేల కోట్లు అడిగారు. కానీ, అక్కడి నుంచి రూపాయి కూడా రాకపోవటంతో ప్రభుత్వ ఖజానా నుంచే భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఆదాయ వనరులకు ఆస్కారం లేకపోవటంతో నిధులు సమీకరణ కష్టంగానే ఉన్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

