హైదరాబాద్ సిటీబ్యూరో/చర్లపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. ఓవైపు అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారిని రౌడీషీటర్లు కత్తితో దారుణంగా పొడిచి చంపారు. మరోవైపు స్టీల్ వ్యాపారుల కండ్లలో కారం కొట్టి రూ.40 లక్షలు దారిదోపిడీ చేశారు. నగరంలో రోజురోజుకూ పెట్రేగిపోతున్న నేరాలు, ఘోరాలతో ప్రజలు వణికిపోతున్నారు. శాంతి భద్రతలు కరువై భయాందోళన చెందుతున్నారు. సురక్షితమైన నగరంగా పేరున్న హైదరాబాద్‌లో నానాటికీ దిగజారుతున్న పరిస్థితులను తలచుకుంటూ మథనపడుతున్నారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంటి ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపార లావాదేవీల విషయంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేటకు చెందిన ఎం.శ్రీకాంత్‌రెడ్డి (42) కొన్నేండ్లుగా హౌసింగ్‌బోర్డు కాలనీ మంగాపురంలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఏడేండ్ల క్రితం పెళ్లికాగా ఇద్దరు పిల్లలున్నారు.
శాంతినగర్, లాలాపేట్ సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన వారితో కలిసి వ్యాపారం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా లాలాపేట్‌కు చెందిన డానియల్, ధన్‌రాజ్‌లను తనకు బౌన్సర్లుగా, వ్యాపారంలో సహాయకులుగా నియమించుకున్నాడు. తన నివాసానికి కొద్దిదూరంలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. డానియల్, ధన్రాజ్పై లాలాపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్టు తెలిసింది. కొంతకాలంగా శ్రీకాంత్‌రెడ్డి భోగారంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఈ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో డానియల్, ధన్‌రాజ్ కొంత సాయపడినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తానంటూ శ్రీకాంత్ హామీ ఇచ్చాడు. తర్వాత జాప్యం చేస్తూ వచ్చాడు. భోగారం సైట్ నుంచి డబ్బులు వచ్చినా తమకు ఇవ్వడం లేదంటూ కోపం పెంచుకున్నారు.
శ్రీకాంత్‌ను అడ్డు తొలగిస్తే భోగారం ల్యాండ్ ఇష్యూకు సంబంధించి తామే నేరుగా కాంటాక్టు పెట్టుకోవచ్చని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌రెడ్డితో శుక్రవారం మధ్యాహ్నం ఆఫీస్‌లో కూర్చుని మద్యం తాగారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్తుండగా యాక్టివాపై డానియల్, ధన్‌రాజ్ వెంబడిస్తూ వెళ్లారు. కార్యాలయం వద్ద ప్రజల సందడి ఎక్కువ ఉండటంతో కాలనీలో అయితే ఎవరూ ఉండరని భావించి శ్రీకాంత్ ఇంటి దరిదాపుల్లో ఆటకాయించి కత్తితో పొడిచి చంపారు. అనంతరం తాపీగా నడుచుకుంటూ వెళ్లారు. వారిలో ఒకరు ‘శ్రీకాంత్‌రెడ్డిని నేనే చంపిన’ అంటూ స్థానికులతో చెప్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.