అలీ చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఎన్ఆర్ డెవలపర్స్‌కు చెందిన ముప్పాళ్ల వెంకటనర్సయ్య నిర్మాణాలు చేపట్టారు. నీటిపారుదల చట్టం-135ఎఫ్ ప్రకారం ఇది అక్రమం. అందుకే గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెవెన్యూ శాఖకూ లేఖ రాశాం. కానీ ఎవరూ స్పందించటం లేదు.
– సురేఖ, నీటిపారుదల శాఖ డీఈఈ
నీటిపారుదలశాఖ ఎఫ్టీఎల్ నిర్ధారణపై ఎన్ఆర్ డెవలపర్స్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని చెప్పింది. నీటిపారుదలశాఖ ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తే తదుపరి మేం చర్యలు తీసుకుంటాం.
– అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో
ఎన్ఆర్ డెవలపర్స్‌పై గతంలో నీటిపారుదలశాఖ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుచేశాం. కానీ కూల్చివేతలకు సంబంధించి రెవెన్యూశాఖ మాకు లేఖ రాయాలి. అప్పుడే మేం కూల్చివేతల సమయంలో బలగాలను పంపి, రక్షణ కల్పిస్తాం.
– బబ్యనాయక్, మంచాల ఇన్స్పెక్టర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్‌ఘట్ పరిధిలోని 25 ఎకరాల అలీ చెరువు ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వ శాఖలు చెప్తున్న సాకులు ఇవీ. కండ్ల ముందు ఎన్ఆర్ డెవలపర్స్ ఏకంగా చెరువును సగానికి పైగా ఆక్రమించి.. రిసార్ట్‌తో పాటు పెద్దఎత్తున విల్లాలను నిర్మిస్తున్నా ప్రభుత్వ శాఖలు తలో మాట చెప్తూ హైడ్రామా సృష్టిస్తున్నాయి. వాస్తవానికి అలీ చెరువు ఆక్రమణలపై ఈ ఏడాది ఏప్రిల్ 24న పోలీసులకు నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది.
ఏఈఈ ఆర్ శారద మంచాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘చెరువు పరిధిలో ఎన్ఆర్ డెవలపర్స్‌కు చెందిన ముప్పాళ్ల వెంకటనర్సయ్య అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. తగిన చర్యలు తీసుకోండి’ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ (నెంబరు 110/2024) నమోదైంది. కానీ ఇప్పటివరకు అటువైపు యంత్రాంగం కన్నెత్తి చూడలేదు.
చెరువు ఆక్రమణను అన్ని శాఖలు నిర్ధారిస్తున్నా కూల్చివేతలకు ఉపక్రమించకపోవటం రేవంత్ సర్కారు బుల్డోజర్ న్యాయం కొందరికే అనేది అక్షరాలా రుజువు అవుతున్నట్టు స్పష్టమవుతున్నది. బీహార్ అసెంబ్లీ బలపరీక్ష సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే క్యాంపు నిర్వహించడం, సీఎం రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చేందుకు అధికారులు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయడమంటే అలీ చెరువు ఆక్రమణ అనేది ప్రభుత్వ, అధికార యంత్రాంగం కనుసన్నల్లో జరిగిందనేది తేటతెల్లమవుతున్నది.
హైదరాబాద్‌లో యజమానులకు నోటీసులు కూడా ఇవ్వకుండా హైడ్రా, ఇతర శాఖలు నిర్మాణాలను కూల్చివేస్తుండగా.. అలీ చెరువు విషయంలో మాత్రం అధికార యంత్రాంగం ఎన్ఆర్ డెవలపర్స్‌కు వత్తాసు పలికే రీతిలో వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ అలీ చెరువుతో పాటు 1500-1600 చెరువుల ఎఫ్టీఎల్ను శాస్త్రీయంగా గుర్తించి, మ్యాప్‌లు, సర్వే నంబర్లతో సహా అధికారిక వెబ్సైట్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది. ఇప్పుడు హైడ్రా కూడా దీనినే ప్రామాణికంగా తీసుకొన్నది.
ఇందులో భాగంగానే ఖానామెట్‌లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. కానీ అలీ చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణను ఎన్ఆర్ డెవలపర్స్ ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని చెప్పింది తప్ప అక్రమ నిర్మాణాలపై స్టే ఇవ్వలేదు. దీంతో నీటిపారుదల శాఖ మరోసారి అధికారికంగా ఎఫ్టీఎల్ను నిర్ధారించే ప్రక్రియ నిర్వహిస్తే సరిపోతుంది. కానీ నీటిపారుదల శాఖ ఆ పనిచేయదు.
రెవెన్యూ శాఖ సైతం మరోసారి ఎఫ్టీఎల్ను నిర్ధారించాలంటూ బంతిని నీటిపారుదలశాఖ కోర్టులోకి నెడుతున్నది. కూల్చివేతలకు రెవెన్యూ శాఖ నుంచి లేఖ రావాలని పోలీస్‌శాఖ భీష్మించుకొని కూర్చున్నది. ఇలా ఎవరికి వారు బంతిని పక్కకు నెడుతూ అలీ చెరువు ఆక్రమణలపై ఈగ వాలనివ్వటం లేదనేది స్థానికుల ఆవేదన.