ఖమ్మం, సెప్టెంబర్ 11: ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం రూ.690 కోట్లతో ఆర్సీసీ వాల్స్, నదిపై రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మున్ముందు మున్నేరు ఒడ్డును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో రోజు సోమవారం మున్నేరు వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
ముంపు బాధితులను ఆదుకోవడానికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ రూ.50 లక్షలు సమకూర్చారన్నారు. ఆ సొమ్మును నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి 1,718 మంది ముంపు బాధితులకు ఒక్కొక్కరికీ రూ.8,463 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇండియన్ టుబాకో కార్పొరేషన్ (ఐటీసీ), పువ్వాడ ఫౌండేషన్ సహకారంతో బాధితులకు రూ.కోటితో విలువైన స్టీల్ సామగ్రి, పరుపులు అందించామన్నారు.
త్వరలో మున్నేరు ఆర్సీసీ వాల్స్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్తంభాద్రి అర్బన్ డెవలప్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్ ఖమ్మం ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, కార్పొరేటర్లు పాల్గొన్నారు.