వినాయక నగర్, జూన్ 20: ట్రాక్టర్ కిందపడి మున్సిపల్ కార్మికురాలి దుర్మరణం చెందిన ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకున్నది. ఐదో టౌన్ ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్‌కాలనీకి చెందిన పోల లలిత (42) మున్సిపాలిటీలో కార్మికురాలిగా పనిచేస్తున్నది. బాబన్ సాహెబ్ పహాడ్ ఏరియాలో మరో కార్మికురాలు గురువారం విధులకు రాలేదు. దీంతో అధికారులు లలితను బాబన్సాహెడ్ పహాడ్‌కు పంపించారు. మరో కార్మికురాలు విమలతో కలిసి లలిత విధులు ముగించుకున్నారు. అదే సమయంలో చెత్త సేకరించే ట్రాక్టర్ అటువైపు రావడంతో లిఫ్ట్ అడిగారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ గైక్వాడ్ సంజీవ్ వాహనం ఆపగా, వారిద్దరు డ్రైవర్ సీటు పక్కన కూర్చున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత లలిత చున్నీ ట్రాక్టర్ చక్రంలో చిక్కుకుపోయింది. అదే సమయంలో మలుపు రావడంతో ఆమె ట్రాక్టర్ పైనుంచి కిందపడగా, అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.