ములుగు, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌ను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్ దుర్భాషలాడాడు. ఫోన్ చేసి మరీ నోటికొచ్చినట్టు తిట్టాడు. ఈ ఆడియో ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామానికి చెందిన బానోత్ రవిచందర్ కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆదివారం రాత్రి తన మేనమామ రోడ్డు ప్రమాదానికి గురికాగా ములుగు ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తీసుకువచ్చాడు. అక్కడికి చేరుకున్న రవిచందర్ పలుమార్లు దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫోన్‌చేశాడు. చివరి క్షణంలో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ ఫోన్ ఎత్తి మాట్లాడగా రవిచందర్ ఆయనపై ఆవేశంతో ఊగిపోయారు.
‘నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని. ఎన్నిసార్లు ఫోన్ చేసిన నీకు రెస్పాన్స్ లేదా? నీకు కొద్దిగ కూడా బాధ్యత లేదా? ఫోన్ లేపవు. మరి ఏంది అని అడుగవు. ఇంకో ఫోన్ మాట్లాడుతవు. ఈడ యాక్సిడెంట్ అయింది. ఎవరు పట్టించుకుంటలేరు. నీకు ఏమైనా బుద్ధి, సిగ్గు, శరం ఉందా? ఇన్నిసార్లు ఫోన్లు చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందామని లేదా? బాధ్యతాయుతమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్నవ్. నువ్వు తమాషా చేస్తానవ్, డ్రామాలు చేస్తావ్. నీకు మానం లేదు.. నా ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయ్యిందో చూడు. కనీస పట్టింపు లేదు. ఎవరో కాదు నేను యాక్సిడెంట్ అయిన వాళ్ల మేన అల్లుడిని. నివ్వు సూపరింటెండెంట్వని ఫోన్ చేసిన. నువ్వు లేపి గిది పరిస్థితి మరి అని చెప్పవా?’ అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మర్యాదగ మాట్లాడాలి అని సూపరింటెండెంట్ సూచించినా సదరు నేత మరింత రెచ్చిపోయి రాయలేని భాషను ఉపయోగించాడు.
ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటి వద్ద ఉన్నా. రెండు, మూడు సార్లు బానోతు రవిచందర్ ఫోన్ చేశాడు. చివరి క్షణంలో ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో అన్నది మొదలు 5 నిమిషాలపాటు భరించలేని బూతులు తిట్టాడు. డ్యూటీలో డాక్టర్ ఉన్నాడని చెప్పినా వినకుండా అగౌరవపర్చే విధంగా మాట్లాడాడు. అతని మేనమామకు రోడ్డు ప్రమాదం జరిగితే డ్యూటీ డాక్టర్ వైద్యం చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు రెఫర్ చేశాడని, ఈ విషయాన్ని చెబుతున్నా వినే పరిస్థితిలో లేకుండా నాన్ స్టాప్‌గా తిట్టాడు. నా వద్ద ఉన్న ఆధారాలతో సోమవారం పోలీస్ స్టేషన్లో రవిచందర్‌పై కేసు పెడతా. ఈ విషయాన్ని వైద్యులతో చర్చించి విధులను బహిష్కరిస్తాం.
– డాక్టర్ జగదీశ్వర్, ములుగు దవాఖాన సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్