హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌కు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. బీకాం, బీబీఏ కోర్సుల్లోనూ మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ కు అవకాశం ఇవ్వాలని స్పష్టంచేసింది. ఇక సెకండియర్‌లో చేరేందుకు ల్యాట్రల్ ఎంట్రీకి, రీ ఎంట్రీకి సైతం అవకాశం కల్పించాలని కమిటీ సూచించింది. బీకాం, బీబీఏ, లా కోర్సుల సిలబస్‌లో మార్పుల కోసం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. ఈ సందర్భంగా బీకాం, బీబీఏ, లా కోర్సు సిలబస్‌లో 15-20శాతం మార్పులు చేయాలని నిర్ణయించారు. యూనైటెడ్ నేషన్స్ సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌కు అనుగుణంగా సిలబస్ రూపొందించాలని, లా కోర్సుల్లో కొత్త గా సైబర్లాను ప్రవేశపెట్టాలని, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌లు తప్పనిసరిచేయాలని నిపుణల కమిటీ సూచించింది.