MPTC | భీమ్‌గల్, జూలై 4: పెండింగ్ బిల్లులతోపాటు ఆరు నెలల గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం మెండోరా ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గురువారంతో తమ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో తమకు రావాల్సిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ మేరకు లేఖను సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి అకౌంట్లకు ట్యాగ్ చేశారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేశామని పేర్కొన్నారు. వెంటనే బిల్లులను మంజూరు చేసి, ఎంపీటీసీలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఎంపీటీసీలు గ్రామంలో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని, గ్రామపంచాయతీలో ఎంపీటీసీలు కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నిధుల్లో ఎంపీటీసీలను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.