హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష, అన్యాయాలపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గళమెత్తారు. కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లను దేశానికి తెలిసేవిధంగా ఆందోళన చేశారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉభయసభల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. జనవరి 31న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, పదిరోజుల పాటు కొనసాగి శుక్రవారం వాయిదాపడ్డాయి. సమావేశాల ప్రారంభానికి ముందురోజే టీఆర్ఎస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయం, కేంద్రం వివక్షకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ఇదే ప్రథమం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి అదనపు కేటాయింపులు, విద్యాలయాలు మంజూరు చేయలేదని, వినతులు పట్టించుకోలేదని ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్ముతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు అవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉభయసభల్లో తీవ్ర దూమారాన్ని రేపింది. టీఆర్ఎస్ పోరాటానికి కాంగ్రెస్ సహా అనేక పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రధాని నుంచి స్పందన రాలేదు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అడ్మిట్ చేసే వరకు ఉభయసభలకు హాజరుకావొద్దని నిర్ణయించారు. దీంతో శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభలను బహిష్కరించారు.
విద్యుత్తు చట్టాన్ని వెనక్కితీసుకోవాలి: రంజిత్‌రెడ్డి
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.