హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపీడీవో కార్యాలయాలకు తగినన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీజీఎంపీడీవోస్ ఫోరం) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రతి పోలింగ్ బూత్కూ రూ.20,000 చొప్పున నిర్వహణ వ్యయం కింద ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్ సృజనకు అసోసియేషన్ అధ్యక్షురాలు జే పద్మావతి, జనరల్ సెక్రటరీ ఎం మోహన్ వినతిపత్రం అందజేశారు. జిరాక్స్ చార్జీలు, పోలింగ్ సిబ్బందికి భోజనం, చెక్‌పోస్టుల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ సౌకర్యాల వంటి ఖర్చులకు నిధుల కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలిపారు.
స్టేషనరీ, హ్యాండ్‌బుక్స్, ఎన్నికల సామగ్రి, వాహనాలు, మానవ వనరుల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేసేవారికి సకాలంలో పూర్తి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. గత ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రూ.315 కోట్లు కేటాయించినప్పటికీ, ప్రస్తుత ఎన్నికలకు కేటాయించిన నిధులు తకువగా ఉన్నాయని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం అంచనా వ్యయం రూ.20 వేల వరకు పెరిగి, ఎంపీడీవో కార్యాలయాలపై భారం పెరిగిందని తెలిపారు. పాలనాపరమైన అడ్డంకులు తొలగించడానికి ఏసీ, డీసీ నిబంధన లేకుండా ఒకే విడతలో నిధులను విడుదల చేయాలని చేయాలని కోరారు.