హైదరాబాద్ : ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిలో(Vijayawada National Highway – 65) మూసీ నది బ్రిడ్జి టేకు మట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు సూర్యాపేట వైపు రాయినిగూడ గ్రామ సమీపానికి సుమారు 2కిలోమీట ర్స్ వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది. ఇది వాహనదారులకు ఇబ్బందిగా మారింది. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇక్కడ నెలకొన్న ప్రమాదకర పరిస్థితి గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు స్వయంగా కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఎంపీ రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) విజ్ఞప్తులను పరిశీలించి గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ఫ్లైఓవర్ మంజూరు చేశారు. దీని నిర్మాణపు పనులను నేషనల్ హైవేస్ అథారిటీ(NHA)త్వరలో చేపట్టనుంది. తన విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల కష్టాలను కడతేర్చేందుకు ఫ్లైఓవర్(Flyover) మంజూరు చేయడం పట్ల ఎంపీ వద్దిరాజు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.