హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో గతేడాది అతిపెద్ద వాక్యాన్ని రాసి గిన్నిస్ ప్రపంచ రికార్డును కైవసం చేసుకొన్న మహబూబ్‌నగర్ జిల్లా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) సభ్యులు.. ఆ రికార్డును ‘గ్రీన్ ఇండి యా చాలెంజ్’కు అంకితమిచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డ్‌ను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు అంకితమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మహిళలు గతేడాది కేవలం 10 రోజుల్లోనే 2.8 కోట్లకుపైగా సీడ్ బాల్స్‌ను తయారు చేశారని కొనియాడారు. వచ్చే ఏడాది 3 కోట్ల విత్తన బంతులను తయా రు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. దేశంలోనే అతిపెద్దదైన 2,087 ఎకరాల కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు నిర్మాణ బాధ్యతలను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
ఆ పార్కులో మినీ జంతు ప్రదర్శనశాల (జూ) ఏర్పాటు కు తన ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటివరకు 25 పార్కులను అభివృద్ధి చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. త్వరలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో పక్షుల ఎన్క్లోజర్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మహా బ్రాండ్ ఉత్పత్తులు, భూగర్భ జలాల పెంపుదలలో జిల్లాకు సోమవారమే రెండు స్కోచ్ అవార్డులు వచ్చాయని తెలిపారు. అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను ఎస్‌హెచ్‌జీ, డీఆర్డీఏ సభ్యులకు అందజేశారు. గిన్నిస్ సంస్థ ప్రత్యేకం గా పంపిన సర్టిఫికెట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్ పరస్పరం ప్రదా నం చేసుకొన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, డీఆర్డీవో యాదయ్య, మెప్మా మాజీ పీడీ శంకరాచారి తదితరులతోపాటు 135 మంది ఎస్‌హెచ్‌జీ, డీఆర్డీవో సభ్యులు పాల్గొన్నారు.