హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): పుట్టినప్పుడు ఉయ్యాల అవుతా… శ్వాసకు ఊపిరి అవుతా.. గూడును అయ్యి రక్షణ అవుతా.. పోయినప్పుడు పాడెను అవుతా.. ఇంతా చేసి మనిషి స్వార్థానికి మాత్రం బలవుతున్నా.. ఇదీ చెట్టమ్మ గోడు..! విచక్షణారహితంగా నరికివేతకు గురవుతున్న చెట్ల అరణ్యరోదనపై కవి, గాయకుడు కార్తీక్ కొడకండ్ల రాసి, ఆలపించిన గేయం. చెట్ల అవసరాన్ని, మానవుడికి అవి ఉపయోగపడుతున్న విధానాన్ని పాట రూపంలో ఆలపించిన కార్తీక్ వీడియోను గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అత్యంత సున్నితంగా మనిషికి ప్రకృతి, చెట్ల అవసరాన్ని చెప్పిన ఈ పాట తనను కదిలించిందని, కండ్లలో నీళ్లు తెప్పించిందని ఎంపీ పేర్కొన్నారు. కవి హృదయ తపన అందరికీ కనువిప్పు కావాలని కోరారు. చెట్ల నరికివేతను తగ్గించాలని, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచడం మన జీవన విధానం కావాలని ఆయన ఆకాంక్షించారు.