హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్-మహేశ్వరం పవర్‌గ్రిడ్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కలిశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హైటెన్షన్ విద్యుత్ వలయాలతో రైతులకు జరిగే నష్టం గురించి కేంద్రమంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించి రైతులకు న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వినతిపత్రం అందించినవారిలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, పిప్పల వెంకటేశ్, కడారి రామకృష్ణ, గూడూరు పెంటారెడ్డి, గూద పర్వతాలు, జెల్ల శివరామకృష్ణ, క్యామ సత్యం తదితరులు ఉన్నారు.