హైదరాబాద్ : ప్రముఖ సినీ హీరో, నిర్మాత ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియోస్ అధినేతగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన విశేష సేవలందించారని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
సుమారు 350 పైగా సినిమాలలో నటించి, వినూత్న సాంకేతిక పద్దతులను ప్రవేశపెట్టి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ అకాల మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, ఆయన అభిమానులకు తీరని లోటని ఎంపీ వద్దిరాజు అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో కుమారుడు రమేష్ బాబు, ఇటీవలే భార్య ఇందిరాదేవీ కన్నుమూయడం తీవ్ర బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుమారుడు, ప్రముఖ హీరో మహేష్ బాబుకు, కుటుంబ సభ్యులకు రవిచంద్ర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.