రవీంద్రభారతి, జనవరి 18 : ‘42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు రాకముందే మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బీసీలను దగా చేసేందుకు మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలు చేస్తున్నడు. ఆ కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొడుతాం’ అని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సభకు ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేసేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించారు.
బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఊకదంపుడు మాటలు చెప్పి 3వేల కోట్ల నిధుల కోసం గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్లారని, బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు 60శాతం బీసీ సర్పంచ్‌లు గెలిచి సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పచెల్లుమనిపించారని, అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధిలేకుండా మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిల్ ఎన్నికలకు వెళ్తామని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాకముందే ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తా, రైల్, బస్‌రోకోలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. ర్యాగ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నేత నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, రామ్దేవ్మోదీ, రాజేందర్, మహిళా నేతలు అనురాధగౌడ్, పద్మ, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.