హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు ఇప్పట్లో సమసేలా కనిపించడంలేదు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని, నాలుగైదు సార్లు ఓడినవారితో తాను కూర్చోవాలా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణిక్‌రావ్ థాక్రే బుధవారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ కోమటిరెడ్డి గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే తాను పార్టీ ప్రధాన కార్యాలయానికి రాలేనని ఆయన తెల్చిచెప్పారు. బయట కలుస్తానని ఆయనకు ఫోన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో థాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయని చెప్పారు.
నియోజకవర్గంలో బిజీగా ఉండటంతోనే బుధవారం గాంధీభవన్‌కు రాలేకపోయానని చెప్పారు. అయినా పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్క కూడా నిన్న పార్టీ కార్యాలయానికి రాలేదని, వారిని ఎందుకు అడగరని ప్రశ్నించారు. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీ పట్టించుకోలేదని చెప్పారు. ఫొటో మార్ఫింగ్ అయిందని స్వయంగా సీపీ తనకు చెప్పారని వెల్లడించారు.