సుందరమైన నీరాకేఫ్‌ను చాట్ భండార్లా మార్చారు. కుట్రలో భాగంగానే రూపురేఖలు మార్చారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్న గౌడన్నల గుండెలపై తన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నడిగడ్డపై ఉన్న నీరాకేఫ్‌ను తరలించడమంటే, గౌడన్నల గుండెలపై తన్నడమేనని ఎక్సైజ్‌శాఖ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ‘త్వరలో నీరాకేఫ్ ఎత్తివేత?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆదివారం ఆయన నెక్లెస్ రోడ్డులోని నీరాకేఫ్‌ను గౌడ సంఘాలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే నీరాకేఫ్ రూపురేఖలు మార్చారంటూ మండిపడ్డారు. కులవృత్తులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో నాడు కేసీఆర్ ఎన్నో ఆలోచనలు చేశారని, వాటిల్లో నీరాకేఫ్ ఒకటి అని వివరించారు. ‘నా జాతిలో ఉన్న అమృతం లాంటి నీరాను ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.20 కోట్లతో దేశంలో ఎకడా లేనివిధంగా నీరా పాలసీ తీసుకొచ్చాం. వైన్‌షాపుల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. నెక్లెస్ రోడ్లో ఆధునికీకరించిన బిల్డింగ్‌లో నీరాకేఫ్‌ను ఏర్పాటు చేస్తే, దాన్ని నిర్వహించడం చేతగాక ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
నీరా పాలసీ, నీరా కేంద్రాన్ని ఎత్తేస్తూ ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం బాధాకరమని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీసీ జనాభా జాబితాలో గౌడ సామాజికవర్గం సంఖ్య దాదాపు 30 లక్షల మంది ఉంటే, 16 లక్షల మందిగా చూపించారని మండిపడ్డారు. ఇప్పటికే గౌడ కులస్తులపై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నదని విమర్శించారు.
నీరాకేఫ్‌ను ఎత్తివేయాలనే ఆలోచనను అన్ని కులాలవారు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ‘మేం తెచ్చిన నీరా కేంద్రాలను జిల్లాలో విస్తరిస్తారనుకున్నాం. కానీ ఉన్నివి తీసేస్తారని అనుకోలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. గీతకార్మిక సోదరులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ మాట్లాడుతూ.. గౌడన్న అస్థిత్వ ప్రతీకపై దెబ్బకొట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గౌడజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నీరాకేఫ్‌ను తీసుకొస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసే కార్యక్రమం పెట్టుకున్నదని దుయ్యబట్టారు. తమ జోలికి వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీరాకేఫ్‌ను ఎక్కడికీ తరలించే ఆలోచన తమకు లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం వివరణ ఇచ్చింది. నీరాకేఫ్‌లో ఫుడ్‌కోర్టులు పెట్టడం సహజమని సమర్థించుకున్నది. ప్రస్తుతం నీరాకేఫ్ వినోద్‌గౌడ్ నిర్వహణలోనే ఉన్నదని స్పష్టంచేసింది. నీరాకేఫ్‌ను హోటల్‌గా మార్చే ప్రతిపాదనలు ఏమీలేవని తెలిపింది. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘త్వరలో నీరాకేఫ్ ఎత్తివేత?’ అనే కథనంపై మంత్రి జూపల్లి కార్యాలయం స్పందించింది. ‘నమస్తే తెలంగాణ’ కథనం నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గౌడ సంఘాల నాయకులు నీరాకేఫ్‌ను సందర్శించిన వెంటనే మంత్రి కార్యాలయం నుంచి వివరణ రావడం ఆసక్తిగా మారింది.
నీరాకేఫ్‌ను ఎత్తివేసి, దానిని హోటల్‌గా మార్చే ప్రయత్నం చేస్తుండటాన్ని ముందే పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ కథనం రాయడం చర్చనీయాంశమైంది. అయితే, పథకం ప్రకారం కేఫ్‌లో అద్దాలు తొలగించడం వల్ల నీరా తాగుతూ సేదతీరుతున్న వారికి హుస్సేస్‌సాగర్ దుర్వాసన వచ్చి, రెండోసారి అటువైపు రావడం మానేస్తున్నారు. దీనికితోడు కేఫ్ వెనుకాల అంతా చెత్తకుప్పగా మార్చారు. నీరా బై ప్రొడక్ట్స్‌కు ప్రచారం కల్పించకపోవడంతో వాటిని కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆఘమేఘాల మీద మంత్రి కార్యాలయం ఇచ్చిన వివరణ కూడా తేదీలతో తప్పులు తడకగా ఉన్నది. దానిని ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి ఇస్తున్నారా? టూరిజం శాఖ నుంచి ఇస్తున్నారా? అనే స్పష్టత కూడా లేదు. ఇచ్చిన వివరణలోనూ కనీసం మంత్రి ప్రస్తావన, కార్యాలయ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.