ఉస్మానియా యూనివర్సిటీ : వారంలోగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్వరమే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వానికి వారంగడువు ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో శుక్రవారం నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులు మెయిన్ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం మోతీలాల్‌నాయక్ మాట్లాడారు. వారంలోగా జాబ్ క్యాలెండర్‌తోపాటు డిగ్రీ అర్హతతో 12 వేల వీఆర్వో ఉద్యోగాలు, డిప్లొమా ఇన్ సివిల్ అర్హతతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించేలా చొరవచూపాలని సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి అజిత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏడాది గడిచినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు కేశబోయిన మల్లయ్య, గూడూరి నవీన్‌కుమార్, గణేశ్, నెమలి సుభాశ్‌గౌడ్, బొల్లం శారద, శానబోయిన శ్రీనివాస్, సుధాకర్‌గౌడ్, వంగాల శంకర్, ఎట్టబోయిన శీను పాల్గొన్నారు.
– హైదరాబాద్
గతంలో ఎంపిక చేసిన 392 మంది లబ్ధిదారులకు సోమవారంలోగా డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే అంబేదర్ సెంటర్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొండి వైఖరిని నిరసిస్తూ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు.
-కృష్ణ కాలనీ
డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి, రాజీవ్‌నగర్, ఇల్లిపూర్, రామేశ్వర్‌పల్లి, నర్సన్నపల్లి తదితర కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మాట్లాడారు. ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి వచ్చి వారం రోజుల సమయం ఇవ్వాలని, సిబ్బందిని ఇంటింటికీ పంపి ఫొటోలు, వివరాలు సేకరిస్తామని, ఆ తర్వాత పట్టాలు ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు.
– కామారెడ్డి