హయత్‌నగర్, ఫిబ్రవరి 7 : బ్యాంకుల అప్పులు తీర్చేందుకు, రైతులకు బకాయిలు చెల్లించేందుకే మదర్ డెయిరీ సంస్థ స్థిరాస్తులు విక్రయించేందుకు పాలకవర్గం నిర్ణయించినట్టు నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ, కరోనా, ఇతరత్రా యాజమాన్య నిర్ణయాలతో సంస్థ రూ.60 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. సంస్థ లాభాల్లో ఉన్నట్టు చూపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని, ప్రస్తుతం నష్టాల్లో ఉన్నట్టు బ్యాంకులు గుర్తిస్తే మార్టిగేజ్ చేసుకున్న నికర ఆస్తులను వేలం వేసే ప్రమాదముందని చెప్పారు. అప్పుల నుంచి సంస్థ బయటపడేందుకు తప్పని పరిస్థితుల్లో మార్టిగేజ్ చేసిన చిట్యాలలోని 29.36 ఎకరాల భూమితోపాటు నకిరేకల్, చండూరులోని స్థలాలను విక్రయించి వచ్చిన డబ్బుతో అప్పులు, బకాయిల చెల్లింపుతోపాటు సంస్థకు అవసరమైన మిషనరీలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. సంస్థ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలుపాలని మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, సొసైటీల అధ్యక్షులను కోరారు.
దిద్దుబాటు చర్యలు చేపట్టాలి :జితేందర్‌రెడ్డి
ఢిల్లీ వారితో పాల విక్రయ ఒప్పందం రద్దు, కరోనా కారణంగానే సంస్థ లాభాల నుంచి నష్టాల బాటలోకి వెళ్లిందని మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి తెలిపారు. మార్కెట్లో పోటీ కారణంగా విక్రయాలు తగ్గడంతోపాటు నష్టాలు పెరుగుతూ వచ్చాయని చెప్పారు. స్థిరాస్థి విక్రయాలకు బదులుగా దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్థను గాడిన పెట్టాలని సూచించారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి మాట్లాడుతూ సంస్థ లాభనష్టాలకు పాలకవర్గమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సొసైటీ చైర్మన్లు భాస్కర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ.. స్థిరాస్తుల విక్రయాల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో మాజీ చైర్మన్లు లింగాల శ్రీకర్‌రెడ్డి, గంగుల కృష్ణారెడ్డి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బెలిదె కృష్ణ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.