మధిర/ కూసుమంచి, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుకానున్న రిజర్వేషన్లు పలువురికి కలిసిరానున్నాయి. ఊహించనివిధంగా వారిని సర్పంచ్, వార్డుమెంబర్ పదవులు వరించనున్నాయి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన తల్లీ కొడుకులకు సర్పంచ్, వార్డుమెంబర్ పదవులు ఏకగ్రీవం కానున్నా యి. గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు, రెండోవార్డు మెంబర్ పదవి ఎస్సీ జనరల్ క్యాటగిరీకి రిజర్వ్ కావడంతో ఈ అవకాశం దక్కనున్నది. గ్రామంలో మొత్తం 478 మంది ఓటర్లు.. 8 వార్డులు ఉన్నాయి. అయితే, ఎస్సీ సామాజికవర్గానికి సంబంధించి ఒకే ఒక్క కుటుంబం గ్రామంలో ఉంటున్నది. దీంతో ఆ కుటుంబానికి చెందిన కాంపల్లి కోటమ్మ సర్పంచ్‌గా, ఆమె కుమారుడు కాంపల్లి దావీదు రెండోవార్డు మెంబర్‌గా ఏకగ్రీవమైనట్టేనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగలితండాలో ప్రేమ పెండ్లి చేసుకున్న యువతికి సర్పంచ్ పదవి వరించనున్నది. తండాలో ఒకేఒక్క ఓటు ఉన్న బీసీ కులానికి రిజర్వేషన్ దక్కడంతో ఆమెను సర్పం చ్ పదవి వరించనున్నది. మంగలితండాకు చెందిన బానోత్ సైదులు నాయకన్‌గూడెంకు చెందిన జిల్లా అనితను పదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరు ప్రస్తుతం మంగలితండాలో నివాసం ఉంటున్నారు. మంగలితండాలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో అనితకు అనివార్యంగా అవకాశం దక్కనున్నది. ప్రేమ వివాహం సర్పంచ్ పదవిని తెచ్చిపెట్టిందని, తండావాసులందరికీ సేవ చేస్తానని అనిత తెలిపారు.