Road Accident | మరికల్ : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. మరికల్ ఏఎస్ఐ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్‌కు చెందిన బొంత వెంకటేశ్, అనురాధ (35) భార్యాభర్తలు. వీరికి కొడుకు బొంత శివకుమార్ (12) ఉన్నాడు. బుధవారం పాము కరవడంతో నాటువైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం మణికొండ గ్రామానికి వెళ్లారు.
గురువారం ఉదయం తిరుపతికి వెళ్లాలని.. వైద్యం అనంతరం బుధవారం అర్ధరాత్రి మణికొండ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. కాగా, మరికల్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దచింతకుంట శివారులో బైక్‌ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా.. శివకుమార్‌ను చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాదానికి గురైన కారు తప్పించుకొని పోగా.. జడ్చర్ల పట్టణంలో పోలీసులు కారును స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించారు.