మందమర్రి, డిసెంబర్ 5: నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది. చిర్రకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా శుక్రవారం రాంటెంకి శ్రీలత, ఆమె కూతురు రాంటెంకి లావణ్య నామినేషన్ వేశారు. తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతో శ్రీలత, తన కూతురు శ్యామలతో కూడా నామినేషన్ వేయించారు.
సర్పంచ్ బరిలో తండ్రీతనయుడు
కంగ్టి, డిసెంబర్ 5: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుదారుగా మణిరాం, బీఆర్ఎస్ మద్దతుదారుగా అతడి తమ్ముడి కుమారుడు రాందాస్ నామినేషన్ దాఖలు చేశారు. మణిరాం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా, అతడి తమ్ముడు గురుదాస్ బీఆర్ఎస్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు. రాందాస్ ఐఐఐటీలో బీటెక్ చేసి, ఎంటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు.