హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికిపైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట. ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలివి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సహేరా ఫాతిమా, డాక్టర్ నాగలక్ష్మి కుందేటి నేతృత్వంలో విద్యార్థులు దివ్య బెంగానీ, మిషికా చిరాగ్ కొటేచా, దృష్టి జైన్, సయ్యద్ ఉస్మాన్ అలీ, సయం జైన్ ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 480 మంది మహిళలతో మాట్లాడినట్టు వారు తెలిపారు. ఫలితాను గురువారం వారు విడుదల చేశారు. ‘తప్పుల్ని వెతకడం కాదు.. మార్గాలను సూచించడమే మా లక్ష్యం’ అని వారు పేర్కొన్నారు.
ప్రజారవాణా కోట్లాదిమందికి జీవనాధారమని, తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9వేల బస్సులు తిరుగుతుండగా, 40 లక్షల మందికిపైగా సేవలు పొందుతున్నారని చెప్పారు. వీరి లో అధికశాతం మహిళలే ఉన్నారని పేర్కొన్నా రు. అయితే ప్రయాణంలో సీట్లు దొరక్క అసౌకర్యాన్ని ఎదురొన్నట్టు 52 శాతం మంది మహిళలు చెప్పారని తెలిపారు. బస్సులలో గొడవలకు కారణాలను విశ్లేషించారు.
23 శాతం మంది మహిళలకు మాత్రమే భద్రతా టూల్స్ గురించి తెలుసని సర్వే సిబ్బంది చెప్పారు. ఆర్టీసీ సిబ్బందికి జెండర్ సెన్సిటివిటీపై శిక్షణ ఇవ్వాలని కోరారు. సర్వేపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందిస్తూ ‘ఈథేమ్స్ అధ్యయనాన్ని స్వాగతిస్తున్నా. సర్వే నివేదిక సూచించిన చాలా అంశాలు ఇప్పటికే అమలుదశలో ఉన్నాయి. మహిళల భద్రత, గౌరవం పెంపునకు ఆర్టీసీ కట్టుబడి ఉన్నది. బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది శిక్షణ, హెల్ప్లైన్లు, సీసీటీవీలు, ట్రాకింగ్ యాప్‌లు, షీటీమ్స్ సహకారం వంటివి ఉన్నాయి’ అని తెలిపారు. సర్వేపై ఉమెన్ సేఫ్టీవింగ్ పూర్వ డీజీ శిఖాగోయెల్ స్పందిస్తూ..‘ప్రతి మహిళ నిర్భయంగా ప్రయాణించాల్సిన హకు కలిగి ఉన్నదన్నారు. ఈ అధ్యయనం ఈ దిశగా దిశానిర్దేశం చేసే రోడ్ మ్యాప్‌లను అందిస్తున్నది’ అని చెప్పారు.