TREIRB | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల గురుకులాల నియామకాల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడనున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికి దాదాపు వెయ్యికి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్‌లాగ్‌లో చేరినట్టు సమాచారం. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులందరూ సంబంధిత సొసైటీల్లో రిపోర్ట్ చేస్తే ఈ బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది. తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) గురుకులాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియను అసమగ్రంగా చేపట్టిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. రీలింక్విష్మెంట్పై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పోస్టుల ఎంపికపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు తీరని అన్యాయం వాటిల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
3 వేల మందికి ఒకటికి మించి పోస్టులు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లోని 9 క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్ చేపట్టింది. ఇప్పటివరకు పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఇతర పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను ట్రిబ్ ఇటీవలే ప్రకటించింది. ఆయా సొసైటీలకు అప్పగిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా అందించింది. డీఎల్, జేఎల్ పరీక్షకు, పీజీటీ పోస్టులకు సమాన అర్హతలు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు పీజీటీతోపాటు, జేఎల్, డీఎల్ పరీక్షలకూ హాజరయ్యారు. పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో అనేక మంది డీఎల్, జేఎల్ పోస్టులకూ ఎంపికయ్యారు. వీరిలో టీజీటీ పోస్టులకు సైతం పలువురు ఎంపికయ్యారు. ట్రిబ్ ప్రకటించిన జాబితా ప్రకారమే దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులను సాధించినట్టు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పీజీటీతోపాటు జేఎల్, డీఎల్ పోస్టులకూ ఎంపికయ్యారు. టీజీటీ సాధించిన వారిలోనూ పీజీటీతోపాటు, జేఎల్ ఎంపికైన వారూ ఉన్నారు.
డీఎల్, జేఎల్ పోస్టులకే మొగ్గు
వారిలో చాలామంది పీజీటీ అభ్యర్థులు అంతకంటే ఉన్నతమైన డీఎల్, జేఎల్ పోస్టులకే మొగ్గు చూపారు. దీంతో 1,276 పీజీటీ పోస్టుల్లో సగానికిపైగా ఖాళీగా ఏర్పడినట్టు తెలుస్తున్నది. ఇక అదే పరిస్థితి 4,070 టీజీటీ పోస్టుల్లోనూ కనిపిస్తున్నది. ఒకటి మించి పోస్టులు సాధించిన 3వేల మంది ఏదో ఒక దానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగానే ఖాళీలు ఏర్పడే అవకాశమున్నది. ట్రిబ్ డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకపోవడంతో 1:2 జాబితాలోని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రిలిక్విష్మెంట్ విధానం అమలు చేస్తే గురుకుల పోస్టుల్లో మళ్లీ బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉండకపోయేది.
1:2 జాబితా అభ్యర్థుల గోడు పట్టించుకోని సర్కారు
రిలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని, రెండో జాబితాను ప్రకటించాలని గురుకుల అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. నియామకాల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూశామని, 1:2 జాబితాలోకి వచ్చినా తుది జాబితాలో చోటు దక్కలేదని, రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేస్తే తమలో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇదే విషయమై అన్నివిధాలుగా, అన్ని వేదికలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలను అందజేసినా ఎలాంటి స్పందన రాలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేలోగానైనా రీలింక్విష్మెంట్ అమలు చేసేలా ట్రిబ్‌కు ఆదేశాలివ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.