హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం రోజుకు రూ.50 ఆలస్య రుసుమును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వారికి ఎంతో ఊరట లభించడంతో ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలకు బారులు కడుతున్నారు. దీంతో ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు 5 పనిదినాల్లో అధికారులు దాదాపు 22 వేలకుపైగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 6 వేలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2,500కుపైగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాహనాలు తప్పనిసరిగా కండిషన్లో ఉండాలని, వాటి యజమానులు ఒరిజినల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్, గ్రీన్ ట్యాక్స్, మీటర్ సీల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే భవిష్యత్తులో చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.