హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ అంశాలపై ఎన్నికల సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా 21,312 ఫిర్యాదులు అందాయి. ఎన్నికల సమస్యల పరిష్కారానికి ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు అత్యధికంగా 20,022 ఫిర్యాదులు అందగా, సీ విజిల్ యాప్‌కు అతి తక్కువగా 1,290 ఫిర్యాదులే వచ్చాయి. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నుంచే అత్యధికంగా 11,732 ఫిర్యాదులు రావడం విశేషం. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి 4,217, రంగారెడ్డి 3,953, హైదరాబాద్ జిల్లా నుం చి 3,562 ఫిర్యాదులు అందాయి. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన వాటిలో 19,762 ఫిర్యాదులను ఎన్నికల సంఘం అధికారులు పరిష్కరించారు. సీ విజిల్ యాప్‌కు ఎక్కువగా అనుమతి లేకుండా పోస్టర్లు వేశారని, బ్యానర్లు కట్టారని ఫిర్యాదులు అందాయి. నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని, బహుమతులు ఇస్తున్నారని కూడా ఎక్కువగానే అందాయి. ఎన్నికల నియామవళికి విరుద్ధంగా మైక్‌లు, లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని, అనుమతి లేకుండా కాన్వాయ్ వాడుతున్నారనీ ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 21 మినహా మిగతా వాటన్నంటినీ పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 1.40 గంటల్లో సమస్యను పరిష్కరిస్తారు.
567 దరఖాస్తుల తిరస్కరణ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ రకాల అనుమతుల కోసం 2,512 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. 567 మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. వాటిలో అత్యధికంగా వాహనాల అనుమతుల కోసం వచ్చినవే ఉన్నాయి. ఇవే 200కు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ర్యాలీ నిర్వహణకు అనుమతి, సభలు, సమావేశాలకు మైక్, లౌడ్ స్పీకర్ల అనుమతి వంటి వాటినే అధికారులు ఎక్కువగా తిరస్కరించారు.