హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 కాలేజీల్లో వెయ్యికిపైగా చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అది మొత్తం మూడేండ్లలో కాదు.. కేవలం డిగ్రీ ఫస్టియర్‌లోనే కావడం విశేషం. ఈ కాలేజీల్లో డిగ్రీ మూడేండ్లు కలుపుకొంటే ఒక్కో కాలేజీలో మూడువేల మంది విద్యార్థులు చదువుకొంటున్నట్టు లెక్క. వీటిలోని రెండు కాలేజీల్లో మాత్రం 1500కుపైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ కాలేజీలో అత్యధికంగా 1,610 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ఆ తర్వాత గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1,548 మంది విద్యార్థులు చేరారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్ ప్రవేశాల గడువు ఇటీవలే ముగిసింది. స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల తర్వాత వివరాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది భారీగా అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య దొరుకుతుండటం, క్వాలిఫైడ్ అధ్యాపకులుండటం, డిగ్రీలో ఎప్పకటిప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటం, కెరీర్‌గైడెన్స్, క్లస్టర్ కాలేజీలు వంటి సంస్కరణల బాటపడుతుండటంతో విద్యార్థులు భారీగా చేరుతున్నారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగేందుకు దోహదపడినది. ఒకే ప్లాట్ ఫాం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను నింపడం, ఏ కాలేజీలో చేరాలన్న స్వేచ్ఛను పూర్తిగా విద్యార్థులకే ఇవ్వడంతో ఇది సాధ్యపడిందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. గతంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు.. అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహించి విద్యార్థులను ఎగరేసుకుపోయేవి. కొన్ని కాలేజీలైతే ఉచిత అడ్మిషన్లంటూ.. స్కాలర్షిప్స్తో చదువు చెబుతామంటూ విద్యార్థులను చేర్చుకొనేవి. దాంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించకముందే విద్యార్థులంతా ప్రైవేట్‌లో చేరిపోయేవారు.
దీంతో సీట్లన్నీ ఖాళీగా ఉండేవి. ఈ సమస్యకు దోస్త్ చక్కటి పరిష్కారాన్ని చూపింది. విద్యార్థుల నుంచి వెబ్ ఆప్షన్లు స్వీకరించి, వారు ఎంచుకొన్న ప్రాధాన్యం మేరకే మెరిట్‌ను బట్టి సీట్లు భర్తీచేస్తున్నది. దాంతో ఆయా కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడింది. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్లు సైతం అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తుండటంతో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి.