RGUKT | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): చదువుల తల్లి సరస్వతీ చెంతనే ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపుతున్నది. ఇంజినీర్లను తయారుచేసే కార్ఖానా అయ్యింది. ఇందులో చదివిన 100 మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వశాఖల్లో ఇంజినీర్ ఉద్యోగాలు సాధించారు. 2012-2016 మధ్యకాలంలో బీటెక్ పూర్తిచేసుకున్నవారు ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ఫలితాల్లో అత్యధిక కొలువులు కైవసం చేసుకున్నారు. వారు శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమ్మేళనం నిర్వహించారు. దీనికి 75 మంది ఉద్యోగాలు పొందినవారు హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ మాట్లాడుతూ.. మాక్ఇంట ర్వ్యూ, వ్యక్తిత్వ వికాసం, పరీక్షలను ఎదుర్కొనేలా సిద్ధమయ్యేందుకు బాస ర ఆర్జీయూకేటీలో పోటీ పరీక్షల కోచిం గ్ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
‘భాషాపండితులకు పదోన్నతులివ్వాలి’
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): భాషాపండితుల అప్‌గ్రేడేషన్‌లో మిగిలిపోయిన వారికి పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ స్టేట్(ఆర్‌యూపీపీ టీఎస్) ప్రభుత్వా న్ని కోరింది. సంఘం రాష్ట్రస్థాయి సమావేశాన్ని శనివారం హైదరాబాద్ లో నిర్వహించారు. గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్ హిం దీ ఉపాధ్యాయులకు అడ్డంకిగా ఉన్న 10-2-3 విధానాన్ని రద్దుచేసి, అందరితో సమానంగా జీహెచ్ఎం పదోన్నతుల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర అ ధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు డిమాండ్ చేశారు.
త్యాగాల వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందిద్దాం: నర్సిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల హక్కుల సాధన పోరులో యూటీఎఫ్ నాయకుల త్యాగాల వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం దోమల్‌గూడలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త పాల్గొన్నారు.
వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు
హైదరాబాద్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): వనపర్తి, కరీంనగర్‌లోని బీసీ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి సైదులు శనివారం ప్రకటనలో వెల్లడించారు. ఈఏపీసెట్-2024లో అర్హత సాధించిన విద్యార్థినులు బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాలకు 12 నుంచి 31వరకు<https://mjptbcwreis. telangana.gov.in>లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈఏపీసెట్-2024 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల ఎంపిక ఉంటుందని చెప్పారు. సీటు పొందిన విద్యార్థినులు కాలేజీ హాస్టల్లోనే ఉండాలని స్పష్టంచేశారు. వివరాలకు 040-23328266 నెంబర్లో సంప్రదించాలని సెక్రటరీ సూచించారు.