హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆ టీనేజర్ వయసు పట్టుమని 17 ఏండ్లు లేవు. కానీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్ల నకిలీ ప్రొఫైళ్లతో మోసగించడంలో దిట్ట. చదువుసాగక జేసీబీ డ్రైవర్‌గా పనిచేసిన ఆ మైనర్‌కు ఆశించినంత డబ్బులు రాకపోవడంతో సైబర్ మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దండుకుంటున్నాడు. దీంతో అతనిపై ఏకంగా 100కుపైగా కేసులు నమోదయ్యాయి. అత్యాశకుపోయి తెలంగాణ పోలీసులకు చిక్కిన ఆ టీనేజర్ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని రామ్‌సిన్ గ్రామానికి చెందిన ఆ టీనేజర్.. ఐపీఎస్ అధికారినంటూ ‘ఫేస్బుక్’ ద్వారా నిజామాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడిని పరిచయం చేసుకున్నాడు.
సీఆర్పీఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్న తన స్నేహితుడు బదిలీపై వెళ్తూ ఫర్నీచర్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాడని నమ్మించాడు. ఆ ఫర్నీచర్‌ను రూ.1.20 లక్షలకు బేరం పెట్టినట్టు చెప్పి, చివరికి రూ.80 వేలకు ఫైనల్ చేశాడు. అనంతరం ఆ వృద్ధుడి నుంచి అడ్వాన్స్‌గా రూ.50 వేలు బదిలీ చేయించుకున్న సదరు టీనేజర్.. మిగిలిన రూ.30 వేలు అడిగాడు. కానీ, అతను చెప్పిన సమయానికి ఫర్నీచర్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధుడు.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన సీఎస్బీ సిబ్బంది.. ఆ మైనర్‌పై తెలంగాణలో 6, దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులు నమోదైనట్టు గుర్తించి, అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ టీనేజర్‌ను బాలనేరస్తుల జైల్లో పెట్టామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని డీజీ శిఖాగోయెల్ తెలిపారు.