హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మొన్నటికిమొన్న జేఎన్టీయూలో జాబ్‌మేళా జరిగితే, దాదాపు 150 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో 10 వేల ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు హాజరైన యువత.. 30 వేలకుపైనే. కంపెనీలు ఎంపిక చేసుకొన్నది.. కేవలం 702 మందిని. మిగతావాళ్లు ఎందుకు ఎంపిక కాలేకపోయారంటే.. నైపుణ్యాలు లేకపోవటమే అంటున్నాయి కంపెనీలు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి నైపుణ్యాలు లేవని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్న ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఉత్పాదక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పుష్కలంగా ఉద్యోగాలు ఉన్నా, వాటిలో 7 శాతం మాత్రమే భర్తీ అవుతున్నాయని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 93 శాతం ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని, యువతలో ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు లేకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నదని అభిప్రాయపడుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి నైపుణ్యాలు పెంచుకొంటే భారీ ప్యాకేజీలతో ప్రైవేటు కొలువులు సిద్ధంగా ఉన్నాయని జేఎన్టీయూ అధికారులు చెప్తున్నారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 702 మంది మాత్రమే ఎంపిక కావటం ఆందోళనకు గురిచేస్తున్నదని అంటున్నారు. మరో 2 వేల మందిని కంపెనీలు షార్ట్‌లిస్ట్ చేశాయని, ఇంటర్వ్యూలు నిర్వహించాక వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు యూనివర్సిటీ ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ సెల్ (యూఐఐసీ) అధికారులు తెలిపారు. వారికి ఉద్యోగాలు వస్తాయో, రావో అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో యువతలో కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉన్నదని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకొంటున్నామని, త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.