కారేపల్లి, జూలై 20 : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ సింగరేణి మండల అధికార యంత్రాంగం పెడచెవిన పెడుతుంది. ప్రతి సోమవారం తాసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరు కావాల్సి ఉండగా ఇక్కడ మాత్రం కొంతమంది మాత్రమే పాల్గొంటున్నారు. మండల స్థాయి ఉన్నతాధికారులకు సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకంతో మండలంలోని మారుమూల దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సింది ఉండగా కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ప్రజా పాలన ప్రాధాన్యత ప్రజల్లో సన్నగిల్లుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బాధ్యత గల అధికారులను ప్రజావాణిలో అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.