హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)లో మరిన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. ఈహెచ్ఎస్ బోర్డు సోమవా రం హైదరాబాద్‌లో సమావేశమైంది.ఈహెచ్ఎస్ పరిధిలోకి మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, స్టేట్ యూనివర్సిటీల ఉద్యోగులు, ప్రభుత్వ లైబర్రీ ఉద్యోగులను చేర్చారు. సీజీహెచ్ఎస్, ఈఎస్ఐఎస్, రైల్వేస్, ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, ఆలిండియా సర్వీస్ అధికారులను మినహాయించారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం.
వైటీపీఎస్ ఐదో యూనిట్ ఆపరేషన్ మరింత ఆలస్యం?
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఐదో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ)పై సస్పెన్స్ కొనసాగుతున్నది. 800 మెగావాట్ల ఈ యూనిట్ సీవోడీ ఎప్పుడన్నది టీజీ జెన్కో తేల్చుకోలేకపోతున్నది. నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో తెలంగాణ జెన్కో 4వేల మెగావాట్ల థర్మల్‌ప్లాంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఒక్కోటి 800మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లు ఇందులో ఉన్నాయి. ఇందులో నాలుగు యూనిట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఐదో యూనిట్‌పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతున్నది. నిరుడు జూన్‌లో సీవోడీ పూర్తి కావాల్సి ఉండగా, మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నదని జెన్కో వర్గాలు చెబుతున్నాయి.