హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సూచనల మేరకు యాంటీడ్రగ్ కమిటీల పెంపుపై ‘నార్కోటిక్ బ్యూరో (టీఎస్ న్యాబ్)’ దృష్టి సారించింది. ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఆఖరికి పీజీ చదువుకునే యువత కూడా డ్రగ్స్‌కు బానిసలవుతుండటంతో ఈ లింక్‌లను ఎప్పటికప్పుడు ఛేదించి అరికట్టేందుకు మరికొన్ని యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ కమిటీల కోసం కాలేజీల ఎంపికను చేపడుతున్నారు. గతంలో వేసిన కమిటీలు ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో.. టీఎస్ న్యాబ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 203 కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ వరకూ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు రెండు వేలకు పైనే ఉండటం.. డ్రగ్ కమిటీలు ఉన్న కాలేజీల సంఖ్య తక్కువగా ఉండటంతో మరికొన్ని కాలేజీల ఎంపిక జరుగుతున్నది. ఇప్పటికే గుర్తించిన హాట్స్పాట్ల ఆధారంగా.. వాటి పరిధిలో ఉన్న కాలేజీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి అన్ని కాలేజీలకు యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.