Rakesh Reddy | సాంకేతికంగా తాను ఓడిపోయినా నైతికంగా తనదే విజయం అని నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులు ఉన్నారని చెప్పారు. నల్గొండలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా తాను గట్టి పోటీ ఇచ్చానని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తన పోరాటం ప్రజలకోసమేనని, ఎల్లవేళలా ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. తనకు పార్టీలకు అతీతంగా చాలా మంది మద్దతు తెలిపారని, వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. తనకు తెలిసింది పోరాటం మాత్రమేనన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించిందన్నారు. అందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికల్లో యావత్ పార్టీ తనకు అండగా నిలిచిందని, తనకు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.