హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని 69% కుటుంబాలు ఆర్థిక అభద్రతతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో తల్లడిల్లుతున్నాయి. సగటు మనిషి ఆర్థిక స్థితిగతులు, కుటుంబాల్లో ఆర్థిక భద్రత తదితర అంశాలపై దేశవ్యాప్తంగా మనీ 9 సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ ప్రజలను ఏ స్థితికి ఈడ్చుకెళ్తున్నాయో ఈ సర్వే కండ్లకు కట్టింది. దేశంలోని 20 రాష్ర్టాలు, 100 జిల్లాల్లో సర్వే కొనసాగింది. 1,154 పట్టణాలు, గ్రామాలను మనీ 9 సంస్థ సందర్శించింది. మొత్తం 31,510 మంది అభిప్రాయాలు సేకరించారు. దేశంలో 46% కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ.15 వేల లోపేనని సర్వే తేల్చింది.
నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతినెలా ఒక కుటుంబానికి ఆహారం కోసమే సగటున రూ.5 నుంచి 8 వేల ఖర్చు అవుతున్నదని ఆర్థిక విశ్లేషకుల అంచనా. ఈ పరిస్థితుల్లో నెలకు రూ.15 వేలతో బతకాల్సి రావడం నిజంగా దుర్భరమే. దేశంలో 6% కుటుంబాలు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాయని సర్వే తెలిపింది. కేవలం 3% మంది విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నది. 20% కుటుంబాలకు పొదుపు అంటే ఏమిటో తెలియదన్న మరో దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం సగటున ప్రతి 100 కుటుంబాల్లో 51 కుటుంబాలు పొదుపు చేస్తున్నట్టు తెలిపింది. దేశంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆర్థిక పరిపుష్టికి ఇదో తార్కాణమని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.
దేశంలోని అత్యధిక కుటుంబాల్లో ఆర్థిక అభద్రత ఏర్పడటానికి, పొదుపు సామర్థ్యం సన్నగిల్లడానికి మోదీ అసమర్థ ఆర్థిక విధానాలే కారణమని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి చర్యలు ఆర్థికరంగం జోరుకు కళ్లెం వేశాయని చెప్తున్నారు. ధరల నియంత్రణను కేంద్రం గాలికి వదిలేయడంతో ప్రజల బతుకు దుర్భరంగా మారిందని, సగటు కుటుంబ ఆర్థిక పరిస్థితి అధఃపాతాళానికి దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే.. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదేమోనని ఆర్థికవేత్తలు ఆందోళనచెందుతున్నారు.
సగటు ఆదాయం నెలకు రూ.15వేల లోపు కుటుంబాలు 46%
పొదుపు అంటే ఏమిటో తెలియని కుటుంబాలు 20%
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్న కుటుంబాలు 6%
విలాసజీవితం అనుభవిస్తున్న కుటుంబాలు 3%