హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు తన రెండో గన్ను హైదరాబాద్‌లో పోలీసులకు అప్పగించాడు. ఇటీవల జల్పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద చోటు చేసుకున్న వివాదం గొడవలకు దారితీయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మోహన్‌బాబు తన లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేయాలని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే ఓ గన్ను ఏపీలోని చంద్రగిరి ఠాణాలో అప్పగించిన మోహన్‌బాబు.. తాజాగా స్పానిష్ మేడ్ గన్ను మంగళవారం పీఏ ద్వారా ఫిలింనగర్ పోలీసులకు సరెండర్ చేయించారు.
మనోజ్ ఆరోపణలు తప్పు: నిర్మల
మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు ఇటీవల తన అనుచరులతో జల్పల్లిలోని ఇంటికి వచ్చి జనరేటర్లో చక్కెర పోశాడని, తద్వారా ప్రమాదాన్ని సృష్టించేందుకు కుట్ర చేశాడని చిన్న కుమారుడు మంచు మనోజ్ చేసిన ఆరోపణలను ఆయన తల్లి నిర్మల ఖండించారు. నిర్మల మంగళవారం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు.