జమ్మికుంట, మార్చి21: సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)వ్యవస్థాపక మాజీ సభ్యుడు, మావోయిస్టు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ శుక్రవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 70 ఏండ్లకు పైబడిన ఆయనను గతేడాది జూలై 8న మంచిర్యాల జిల్లా పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి హుస్సేన్ ఖమ్మం, హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. 2009లో జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ కాగా, 2013 వరకు జైలు జీవితం గడిపాడు.
అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. పదకొండేండ్ల నుంచి జమ్మికుంటలో సాధారణంగా జీవిస్తున్నాడు. గత జూలై 8న హుస్సేన్‌ను ఆయన ఇంటి నుంచి మంచిర్యాల జిల్లా పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు, మానవ హక్కుల వేదిక నాయకులు ఆరోపించారు. హుస్సేన్ అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ఖండించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఆర్కే గని 1వద్ద హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని మంచిర్యాల, వరంగల్ జిల్లాలో ఉపా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 8నెలల నుంచి ఖమ్మం, చంచల్‌గూడ జైలులో హుస్సేన్ ఉన్నాడు.