హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : సహజంగా మంత్రులు, అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టాక ఒకట్రెండు ఫైళ్లపై సంతకాలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి అధికారికంగా ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్నట్టు భావిస్తారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన ఒకట్రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఆ తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖకు సంబంధించిన ఫైళ్లు ఏమైనా ఉన్నాయా? అని అధికారులతో ఆరా తీశారు. ఆ శాఖ అధికారులు ఫైళ్లు లేవని చెప్పడంతో కంగు తిన్నారు. ‘అదేంటి? ఒక్క ఫైల్ కూడా లేదా?’ అని ప్రశ్నించారు. ‘ఇప్పుడే కాదు సార్.. రెండేండ్ల నుంచి ఒక్క ఫైల్ కూడా రాలేదు’ అని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో మంత్రి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘ఏ ఫైలూ లేదంటే పనేమీ లేదని అర్థం.. ఇక్కడ నేనేం చేయాలి? అసలు పనిలేని శాఖకు మంత్రి పదవి ఏమిటి?’ అని లోలోనే గొణుక్కున్నారు. తర్వాత మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్రస్థాయిలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల్లో సంస్కరణలు చేయడంతో పాటు వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను ఏర్పాటుచేశారు. సంస్కరణలు, విజన్ డాక్యుమెంట్ పేరుతో అప్పట్లో హడావుడి చేసిన చంద్రబాబు.. ఆ క్రమంలోనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖకు కూడా అంకురార్పణ చేశారు. అప్పట్లో కొంతకాలం కార్యకలాపాలు సాగినా క్రమంగా అది ప్రాభవం కోల్పోయింది.
ప్రతి శాఖకూ మంత్రితోపాటు ఆయా కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఉండటం, ఐఏఎస్ అధికారి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం, ఆయా శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు బోర్డు సభ్యులుగా ఉండటంతో ఈ శాఖకు పెద్దగా పనిలేకుండా పోయింది. ఉదాహరణకు సింగరేణి కాలరీస్ కంపెనీతోపాటు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఆర్టీసీ), తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీజీ జెన్కో), ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ), తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) తదితర ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పరిధిలోకి వస్తాయి.
మంత్రి: మీ ఫైళ్లు కూడా పట్టుకురండి?
అధికారి : లేవు సార్
మంత్రి : ఒక్క ఫైల్ కూడా లేదా?
అధికారి : లేదు సార్. రెండేండ్లుగా మన శాఖకు ఒక్క ఫైల్ కూడా రాలే
మంత్రి : అదేంటి? ఒక్క ఫైల్ కూడా రాలేదా? అంటే మన శాఖలో ఏ పనీ లేనట్టా?
అధికారి : మౌనం
మంత్రి : చెప్పండి.. అసలు మన శాఖలోని
కార్యకలాపాలు ఏంటి? మీరు రోజూ ఏం పని చేస్తారు? అధికారి : గతంలో కార్పొరేషన్లు, సహకార సంస్థలకు సంబంధించిన పాలసీల తయారీ, వాటి అమలుపై పర్యవేక్షణ తాలూకు విధులు ఉండేవి. రెండేండ్లుగా మాకు ఏ పనీ లేదు సార్
మంత్రి : అధికారి వంక ఆశ్చర్యంగా చూస్తూ మౌనం
-ఇటీవల సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజార్‌కు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారికి మధ్య సంభాషణ ఇది!