చిక్కడపల్లి, జూన్ 14: ఈపీఎఫ్ పెన్షనర్ల పెన్షన్ పెంపుదలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోషియారీ కమిటీ సిఫార్సులు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన మాటను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తప్పిందని, నేటికీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్నదని ఈపీఎఫ్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు మండిపడ్డారు. కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కనీస పెన్షన్‌గా రూ.3000 చెల్లించాలని 2013లో కోషియారీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిందని తెలిపారు. అది నేటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో అమలులో వున్న ఈపీఎఫ్ పెన్షన్ లెక్కింపు విధానాన్ని మార్చివేశారన్నారు. ఫలితంగా అధిక పెన్షన్ రావాల్సిన పెన్షనర్స్‌కు రూ.2,500, నుండి రూ.3,500 వరకు నష్టం చేకూరేలా ‘ప్రోరాటా’ అనే కొత్త పద్ధతి అమలులోకి తెచ్చారని వివరించారు. అధిక ఈపీఎఫ్ పెన్షన్ల లక్ష్యసాధన దిశగా తీవ్రవైన ఐక్యపోరాటాన్ని రూపొందిస్తామని చెప్పారు. కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రంగయ్య, పీఎన్ మూర్తి, ఆంధప్రదేశ్ నాయకుడు సుధాకర్, తదితరులతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 65 మంది ప్రతినిధులు హాజరయ్యారు.